యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజకీయంగా మానసికంగానూ తీవ్రంగా ఎంతో నష్టపోయారు. వైయస్సార్ మరణానంతరం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తోన్న జగన్ ను గత కొన్నేళ్లపాటు చాలామంది తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందులు్ ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ పదవులకోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధపూరిత రాజకీయాలకోసం జగన్ ను, వైయస్సార్ ను నిందించినవారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమయ్యారో చూడండి. మొదటిగా జగన్ ఆస్తులపై విచారణ చేయాలని మాజీ మంత్రి శంకర్రావు సీబీఐకు లేఖ రాసారు. జగన్ కేసులు నడిచినంత కాలం కాంగ్రెస్ తో పాటు టీడీపీ నేతలు సైతం శంకర్రావును ఓ రేంజ్ లో పొగిడేవారు. అనంతరం శంకర్రావు పరిస్థితి దారుణంగా తయారైంది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రి పదవి పోగొట్టుకొవడం తోపాటు అరెస్టయ్యారు. ఇంట్లో ఉన్న శంకర్రావును బట్టలు వేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. శంకర్రావు తర్వాత జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ మరో మంత్రి ఎర్రన్నాయుడు దురద్రుష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
జగన్ ను, వైఎస్సార్ ను తీవ్ర స్థాయిలో విమర్శించిన మరో టీడీపీ నేత రేవంత్ రెడ్డి. చనిపోయిన వ్యక్తని కూడా చూడకుండా వైయస్సార్ ను పావురాల గుట్టలో పావురం అయిపోయాడని విమర్శించాడు.. అనంతరం టీడీపీలో ఏకాకిలా మిగిలి అనంతరం కాంగ్రెస్ లో చేరి మనుగడ కోసం ప్రయత్నిస్తున్నాడు. జగన్ కు జైల్లో చిప్పకూడు తిన్నా బుద్ధి రాలేదని విమర్శించిన రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కై అదే చిప్పకూడు తిన్నాడు.అప్పట్లో టీడీపీ నేత సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు కూడా సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణకు సలహాలు, సూచనలు ఇస్తుండే వారని విన్నాం. కానీ విజయరామారావు కుమారుడు కూడా అదే సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు. ఆయనపై కూడా ఇటీవల పలు కేసులు నమోదయ్యాయి. దీనంతటికీ కారణమైన తెలుగుదేశం పార్టీ పతనావస్థకు చేరుకోగా.. వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి చంద్రబాబు మెప్పుకోసం, మంత్రి పదవికోసం ఇష్టానుసారంగా మాట్లాడిన మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయ జీవితం దాదాపుగా ముగిసిపోయింది. కనీసం వార్డు మెంబరుగా కూడా ఆది నారాయణ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు.
వీరందరినీ నడిపించిన సోనియాగాంధీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విభజన నేపధ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా దేశంలో కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పుకోవడానికి పట్టుమని నాలుగు రాష్ట్రాలు కూడా లేవు. చివరకు వందేళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ ప్రస్తుతం దేశంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని పరిస్ధితికి వచ్చింది.జగన్ కేసుల్లో పెట్టి ఇరికించడంలో అప్పటి హోం మంత్రి చిదంబరం కూడా ప్రముఖ పాత్ర వహించారు. అలాగే చిదంబరం కుమారుడు కూడా సీబీఐ కేసుల్లో ఇరుక్కోగా ఆయన కుమారుడిని కేసులనుండి విడిపించేందుకు నానా ప్రయత్నాలు చేపట్టారు. తాజాగా చిదంబరాన్ని కూడా ఇంట్లో ఉండగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు.ఏదేమైనా వైయస్సార్ కుటుంబాన్ని విమర్శించిన వారంతా ఏదొక రూపంలో నష్టపోయారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో జగన్ ని విమర్శించిన ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి దేవినేని ఉమలు కూడా దారుణంగా ఓటమిపాలయ్యారు. గతంలో తీవ్రమైన పదజాలంతో వారిని దూషించిన వీరిద్దరూ రాజకీయ జీవితంకోసం ప్రాకులాడుతున్నారు. అయితే వీరందరినీ రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలోనూ ఇంతెత్తున ఎగిరిన నేతలంతా కాలక్రమేణా ఏమయ్యారో చూశామని, రాజకీయాలు రాజకీయాల్లానే ఉండాలని లేకుంటే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. బహుశా జగన్ చెప్తున్న దేవుడున్నాడు.. అన్నీ చూస్తున్నాడు అంటే ఇదేనేమో.