ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధానిని అమరావతిని నుంచి దొనకొండకు తరలిస్తారంటూ.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటితో సహా, అమరావతిలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉంది కాబట్టి..కాలువలు, డ్యామ్‌లు, పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని… లక్ష రూపాయలు అయ్యే పనికి 2 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని…దీని వల్ల రాజధాని నిర్మాణానికి ఖర్చు భారీగా అవుతుందని బొత్స చెప్పారు. రాజధాని విషయంలో ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని… దీనిపై త్వరలోనే తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని…బొత్స మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. అమరావతి నుంచి రాజధానిని దొనకొండకు మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని…అందుకే వరదలను అడ్డుపెట్టుకుని మంత్రి బొత్సచే మాట్లాడించారని…ఎల్లో మీడియా ఛానళ్లు కూడా పచ్చ కథనాలు వండి వార్చాయి.
అయితే మీడియా సమావేశంలో బొత్స చెప్పిన విషయాలేవి కొత్తవి కావు. గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అమరావతికి వరద ముంపు ఉందని పలు సందర్భాల్లో అంగీకరించింది. అప్పట్లో చంద్రబాబు హయాంలో ముంపు ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తున్నారని దాన్ని అడ్డుకోవాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాజధాని నిర్మిస్తున్న అమరావతి ప్రాంతంలో దాదాపు 10వేల ఎకరాలకు ముంపు ముప్పు ఉన్న మాట వాస్తవమేనని నాటి చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. మరి అలాంటి చోట రాజధాని ఎలా నిర్మిస్తారని ఎన్‌జీటీ ప్రశ్నించగా… ఆ 10 వేల ఎకరాల ముంపు ప్రాంతాన్ని 25 అడుగుల మేర మట్టితో పూడ్చి పైకి లేపుతామని, అలా పైకి లేపిన తర్వాతే..నిర్మాణాలను చేపడతామని గతంలో ఏపీ ప్రభుత్వమే ప్రకటించింది. అంతే కాదు…వరద ముంపుకు గురయ్యే అమరావతిలాంటి పల్లపు ప్రాంతం..రాజధానిగా ఏమాత్రం శ్రేయస్కరం కాదని శివరామకృష్ణన్ కమిటీ కూడా గతంలో తేల్చి చెప్పింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చెత్తబుట్టలో పడేసి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాడు. నిజానికి అమరావతి ప్రాంతంలో సాయిల్ మెత్తగా ఉంటుంది. భారీ నిర్మాణాలకు ఇక్కడ నేల ఏ మాత్రం అనువు కాదు. అమరావతిలో నిర్మిస్తున్న పలు భవనాలు నేలలో కుంగిపోయిన ఉదంతాలు చాలా జరిగాయి. అందుకే వెలగపూడి సచివాలయంలో నిర్మాణంలో 33 మీటర్ల లోతులో పిల్లర్లు వేశారు. ఇక బాబు గ్రాఫిక్స్‌లో చూపిన ఆకాశహర్మ్యాలు కట్టాలంటే…ఎన్ని వందల మీటర్ల లోతు నుంచి పిల్లర్లు వేయాలో ఊహకే అందని విషయం.
ఇక రాజధానిని వరద ముంపు నుంచి కాపాడాలంటే… నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని, దీని కోసం కాలువలు తవ్వాల్సి ఉంటుందని బొత్స చెప్పారు. వాస్తవానికి అమరావతి ప్రాంతానికి కొండవీటి వాగు ముప్పు ఎప్పటికీ పొంచే ఉంటుంది. భారీ వరదలు వస్తే కొండవీటి వాగు ఉప్పొంగితే.. అమరావతికి ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. గతంలో కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని కాపాడుతానంటూ.. చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనను ఇప్పుడు గుర్తుకు చేసుకోవాలి. అయితే తాజాగా అమరాతికి వచ్చింది కేవలం కృష్ణమ్మ వరద ప్రవాహమే..ఒకవేళ స్థానికంగానూ భారీ వర్షాలు కురిసి కొండవీటి వాగు కూడా పొంగి ఉంటే రాజధాని పూర్తిగా ముంపుకు గురయ్యేది. అందుకే బొత్స రాజధానిగా అమరావతి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పాడు. కానీ రాజధానిని మారుస్తామంటూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే టీడీపీ, ఎల్లో మీడియా ఛానళ్లు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన..వైసీపీ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మారుస్తుందంటూ విష ప్రచారం మొదలుపెట్టాయి. బాబుకు ప్రజల భద్రత కంటే..తన రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అని…అమరావతి రాజధాని విషయంలో మరోసారి తేలిపోయింది.