నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి.
అమెరికాలో ప్రముఖ ఉద్యమ నేత మార్టిన్ లూధర్ కింగ్ వచనాలు ప్రస్తావించి, చరిత్రను మార్చే దిశగా తాను కూడా ప్రభుత్వాన్ని సాగిస్తున్నానని దైర్యంగా చెప్పారు. పాలకులు ధ్యాస పెడితే మార్పు అనేది తీసుకు రావడం సులభం. చెడు నుంచి మంచికి, అవినీతి నుంచి నీతికి, చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తేనే మానవ నాగరికతకు అర్థముంటుంది. ప్రతి జాతి, ప్రతి దేశం, ప్రతి సమాజం అటువంటి ప్రయాణం చేయాలి. ఒక మార్పు తీసుకురావాలంటే నాయకత్వం నుంచి అది రావాలి అన్న మాటలను ఉటంకించడం ద్వారా తన విజన్ ను ప్రపంచానికి జగన్ తెలియచేశారు.
అవినీతి, లంచాలు లేని రాష్ట్రం నిర్మించాలని నా లక్ష్యం. అన్నంపెడుతున్న రైతు ఆకలి బాధతో చనిపోకూడదన్నది నా కల. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలనేది నా కోరిక. అందరికీ సొంత ఇల్లు నిర్మించాలన్నది నా కల. ఇలా ఆయా అంశాలను వివరించారు. అదే సమయంలో ఆయన ఈ రెండున్నరనెలల్లో సాదించిన కొన్ని విషయాలను కూడా సభకు తెలియచెప్పారు.బడ్జెట్ సమావేశాలలో 19 బిల్లులు తెచ్చిన వైనాన్ని తెలియచెప్పారు.4 లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించిన సంగతి తెలియచేశారు.ఇది నిజంగానే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లే.ఎపిలో కొత్త వ్యవస్థకు ఇది నాందీ పలుకుతుంది.
దీనిని విజయవంతం చేయడంపైనే ఈ చరిత్ర సాఫల్యం ఆదారపడి ఉంటుంది. ఇప్పటివరకు జగన్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన హామీలను, అంశాలను అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్దం చేసుకున్నారు.అమ్మ ఒడి,రైతు భరోసా వంటి కార్యక్రమాల ద్వారా కొత్త చరిత్రలోకి వెళుతున్నమాట నిజమే.సంక్షేమ పరంగా ఆయన ఒక రికార్డు సృష్టిస్తున్నారు.అదే క్రమంలో అబివృద్ది వైపు పరుగులు పెట్టించాలి. చరిత్రను మార్చాలంటే ఈ యాత్రను మరింత దిగ్విజయంగా సాగించగలగాలి. ముఖ్యంగా పరిశ్రమల రంగంలో కొన్ని పరిశ్రమలు సాదించగలగాలి.అందుకోసం అంతకుముందు,పారిశ్రామికవేత్తలతో చెప్పిన విషయాలు లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయి.ఒక అప్లికేషన్ పెడితే చాలు..ముఖ్యమంత్రి కార్యాలయమే అన్ని ఏర్పాట్లు చేస్తుందని జగన్ ప్రకటించారు ఆ దిశలో చర్యలు ఉండాలి.
అలాగే అవసరమైన స్కిల్ ను పెంచేలా యువతకు శిక్షణ కార్యక్రమాలు బాగా జరగాలి. అప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా బాగా ముందుకు వస్తారు అప్పుడే రాజకీయ చరిత్రనే కాదు..ఎపిలో పరిశ్రమల చరిత్రను కూడా మార్చినవారు అవుతారు.అలాగే ఇప్పుడు జగన్ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. అవినీతి రహితంగా టెండర్లను తీసుకు వస్తామని చాలెంజ్ చేసి పోలవరం ప్రాజెక్టులో మిగిలిన పనులకు కొత్త టెండర్లు పిలిచారు.దీనిని విజయవంతంగా చేయగలిగితేనే ఆయన చరిత్రను మార్చగలిగినవారు అవుతారు. ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం..నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న శ్రీ శ్రీ మాటలను గుర్తుకు తెచ్చుకున్న జగన్ నిజంగానే దానిని తిరగరాయడానికి గొప్ప అవకాశం వచ్చింది.
ఏపీలో 151 సీట్లు పొందడం ద్వారా సరికొత్త రాజకీయ చరిత్ర ను సృష్టించిన జగన్ ఇప్పుడు ఏపీ భవిష్యత్తును తీర్చి దిద్దగలిగితే..అప్పుడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం బదులు ఆంద్ర దేశ చరిత్ర చూస్తే గర్వకారణమే అన్న వచనాన్ని ఆలపించగలుగుతారు.అందువల్ల అసలు కధ ముందు ఉంది. ఇంతవరకు ఆయన లక్ష్యశుద్ది, చిత్తశుద్ది రుజువు చేసుకున్నారు.కాని చిత్తశుద్దితోనే అన్ని అయిపోవు.చరిత్ర మారిపోదు.కనుక దానిని ఆచరణలో చేసి నిజంగానే చరిత్రను మార్చితే జగన్ కు గొప్ప పేరు వస్తుంది. ఆ దిశలో జగన్ పయనించి, ఆంద్రప్రదేశ్ దశను మార్చుతారని ఆశిద్దాదం.ఆల్ ద బెస్ట్ చెబుదాం. By Kommineni Info