బంతి.. చామంతి ముద్దాడుకున్నాయిలే… యురేకా కసామిసా.. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది.. ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ విన్నపుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన అప్పటి నటి రాధిక గురించి ఈ తరంవారికి కూడా కచ్చితంగా తెలిసే ఉంటుంది.. అంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది ఆమె. అప్పటి అగ్రనటులందరితో నటించడమే కాకుండా ప్రముఖ సీరియళ్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ఎటువంటి అసభ్యకర సన్నివేశాల్లోనూ తన కెరీర్ లో రాధిక నటించలేదంటే ఆమె ఎంత డెడికేటెడ్ హీరోయిన్ అనేది అర్ధం చేసుకోవచ్చు. సహజ సౌందర్యంతోపాటు, నటనలో ప్రతీ పాత్రకూ న్యాయం చేయగలిగిన నటి రాధిక.. అడపాదడపా ఆమె రియాలిటీ షోల్లో, సినీ ఫంక్షన్లలోనూ సందడి చేస్తున్నారు. ఇటీవల అమ్మ, అక్క క్యారెక్టర్ల చుట్టూ కధాంశంతో సినిమాలు తీస్తున్న ట్రెండ్ నడుస్తుండడంతో రాధిక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాల్లో అరంగేట్రం చేసిననాటినుంచి ఇప్పటివరకూ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు, తెలుగు, తమిళ సీరియళ్లలో రాణిస్తున్న ఈ నటి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను వెండితెరపై అలరించాలని కోరుకుందాం. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా రాధికకు దరువు తరపున 56వ పుట్టినరోజు శుభాకాంక్షలు.
