అధికారం అడ్డంపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్ చేసిన దోపిడీలు ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయి.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, కుమార్తె పలువుర్ని బెదిరించి డబ్బు వసూలుచేసినట్టు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇందులో బాగాంగ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఈ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ నుంచి ఏపీ అసెంబ్లీకి సామగ్రిని తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను తాను వినియోగించుకున్నానని కోడెల తెలిపారు.
తన దగ్గరున్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాల్సిందిగా అసెంబ్లీ అధికారులకు లేఖ కూడా రాశానని, కానీ అసెంబ్లీ అధికారులు తన లేఖపై ఇంతవరకూ స్పందించలేదని ఆయన చెప్పారు. ఇప్పటికైనా అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని కోడెల స్పష్టం చేశారు. లేదంటే ఈ ఫర్నీచర్ కోసం ఎంత ఖర్చయిందో చెబితే తాను చెల్లించేందుకు సిద్ధమేనని కోడెల చెప్పారు. 2017, మార్చి నెలలో ఏపీ అసెంబ్లీకి తరలిస్తున్న కొంత ఫర్నీచర్, కొన్ని ఏసీలు మాయం కావడంపై అసెంబ్లీ కార్యదర్శి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.