సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గట్టి హెచ్చరికలు చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేశారు.
పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఇతర దేశాల్లో జరిగిన హింసాకాండకు చెందిన వీడియోలను కొందరు వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారని అంజనీకుమార్ తప్పుపట్టారు. ఇలాంటి చర్యల ద్వారా నగరంలో శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే అవకాశముందని కమిషనర్ చెప్పారు. వాట్సాప్ వీడియోలు, మెసేజ్ లపై పోలీసు నిఘా పెట్టిందని వివరించారు. ఈ నేపథ్యంలో వీడియోలు షేర్ చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.