ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్ జరపిన చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం సచివాలయంలో ఆయా ఆస్పత్రుల యాజమాన్యం, సిబ్బందితో చర్చలు జరిపారు. ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు కమిటీ వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు వెంటనే అందుబాటులోకి రానున్నాయి.