వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్ ఇంట్లో ఉన్న చంద్రబాబు తమ ఇంట్లోని విలువైన వస్తువులన్నీ తరలించారని, చివరకు కృష్ణానది కావాలనే ప్రవాహాన్ని పెంచుకుంటోందని నిందించేట్టున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు బీజేపీని వదిలిపెట్టాక ఆ పార్టీకి చెందిన మీడియా బీజేపీని ఒక విలన్‌గా చిత్రీకరించిందని అన్నారు. మొన్నటిదాకా మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసిందని, ఇప్పుడు టీడీపీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారని విజయసాయి విమర్శించారు. ఇప్పుడు ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చిపడిందని, రివర్స్ గేర్ వేయక తప్పదని ఆయన చెప్పారు.
