ఒకే పార్టీలో ఉండాలి, ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే అనుకునే రోజులు కావివి. చాలా మంది ప్రజా ప్రతినిధులు… స్వలాభం చూసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీతో జట్టు కట్టేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఇది మరింత ఎక్కువగా ఉంది. తాజాగా టీడీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ కురెళ్ళ రామ్‌ప్రసాద్ వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చడంతో పాటు ఉప ముఖ్యమంత్రి నానికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు కురెళ్ళ రామ్‌ప్రసాద్ తెలిపారు. ఏలూరు లోని శనివారపుపేట పార్ధసారథి కల్యాణ మండపంలో ఆదివారం వేలాదిమంది కార్యకర్తలతో కలిసి నాని సమక్షంలో పార్టీలో చేరారు. నాని వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో నాని మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాలను పక్కన పెట్టి పేదవాడికి అండగా ఉండి ఆదుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందన్నారు. ఎన్నికల వరకే పార్టీలన్నారు. తాము సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తామన్నారు. ఎంతోమంది వైసీపీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి నానిని, కురెళ్ళ రామ్‌ప్రసాద్‌ను పార్టీ కార్యకర్తలు గజమాలతో అభినందించారు.
