ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు. ఆది నారాయణ రెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దీంతో ఆది బీజేపీలో చేరడం ఖాయం అని సమాచారం. నడ్డాతో ఆది నారాయణ రెడ్డి భేటీ కావడం టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఆది నారాయణ రెడ్డి.. బీజేపీలోకి వెళతారని కొంత కాలంగా ప్రచారం జరగుతోంది. ఇప్పుడా అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఆదినారాయణరెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలోకి జంప్ అయ్యారు. మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వైసీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి వెళ్లాలంటే కష్టం. అందుకే ఆయన బీజేపీలోకి వెళ్లనున్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఆది ఓడిపోయారు. కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డిపై రాజకీయ పరమైన ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంది. జగన్ ను కూడా ఆయన సవాల్ చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో, ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో, రాజకీయ ఒత్తిడిని అధిగమించేందుకు బీజేపీలో చేరడమొక్కటే మార్గమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, బీజేపీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు సమాచారం.
