మాజీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేక..తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారి తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న యామిని సాధినేని బాబుకు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఫైర్ బ్రాండ్ , మాజీ హీరోయిన్ దివ్యవాణి కూడా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. యామిని సాధినేని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు కలువగా…ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన ఓ సీనియర్ నేత దివ్యవాణికి కాషాయ కండువా కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సదరు నేత రాయబారంతో దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు అంగీకరించారని తెలుస్తోంది.త్వరలోనే దివ్యవాణి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దివ్యవాణి గతంలో ప్రధాని మోదీపై, నాటి ప్రతిపక్ష నేత జగన్‌లపై తీవ్రంగా విమర్శలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో దివ్యవాణి మోదీని తీవ్ర పదజాలంతో దూషించింది. అయితే మోదీ నాయకత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం, ఇటు ఏపీలో చంద్రబాబు ఘోర పరాజయం పాలవడంతో దివ్యవాణి పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న దివ్యవాణి త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకు వయసైపోవడం, లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా లేకపోవడం, మరోపక్క జగన్ పాలనలో దూసుకుపోతుండడంతో మరో పదేళ్ల వరకు టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని దివ్యవాణి వంటి నేతలు భావిస్తున్నారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రావడంతో యామిని సాధినేని బాబుపై అసంతృప్తిగా ఉంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీడియా చర్చల్లో కూడా యామిని కనిపించలేదు. తరచుగా జగన్‌పై విమర్శలు చేసే యామిని..ఎన్నికల ఫలితాల తర్వాత కామ్ అయిపోయింది. తాజాగా బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్‌తో యామిని కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా టీడీపీలో బలమైన వాయిస్ వినిపించే ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్‌లు బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్..ఎమ్మెల్యే రోజాకు ధీటుగా మాట్లాడగలిగిన యామిని సాధినేని, దివ్యవాణి వంటి మహిళా నేతలు ఇప్పుడు టీడీపీలో ఎవరూ కనిపించటం లేదు. టీడీపీ నేతలు రోజుకొకరు పార్టీకి దూరమవుతున్నా..చంద్రబాబు అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. యామిని, దివ్యవాణి లాంటి బలమైన వాయిస్‌లు కలిగిన నేతలను బాబుగారు వదులుకోవడం వెనుక మతలబు ఏంటో ఆయనకే తెలియాలి. అయితే టీడీపీ నేతలు బీజేపీలో చేరడం వెనక బాబుగారి రాజకీయ చాణక్యం ఉందని…మోదీతో మళ్లీ సఖ్యత కోసం, భవిష్యత్తు అవసరాల కోసం తన పార్టీ నేతలను బీజేపీలో చేరేలా చక్రం తిప్పుతున్నారని ఏపీ రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది. మొత్తంగా యామిని, దివ్యవాణిలు పార్టీని వీడుతున్నారన్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.