ఏపీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు భారీగా జోరందుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు త్వరలో కమలం గూటికి చేరొచ్చని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాదినేని యామిని త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందట.. కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని చర్చలు జరుపుతున్నారని, త్వరలో ఆమె బీజేపీలో చేరనుందని టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ, బీజేపీని విమర్శించడంలో టీడీపీ కీలక నేతలతో పోటీపడ్డ యామిని ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. తన సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉండే స్థానంనుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆసీటు టీడీపీ మరోనేతకు కేటాయించడంతో ఆమె నిరాశ చెందారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యామిని బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసింది. 175 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 23 సీట్లకే పరిమితమైంది. 25 లోక్ సభ సీట్లల్లో మూడింటిని మాత్రమే గెలుచుకుంది. అయితే అధికారం కోల్పోయిన నెలరోజులకే టీడీపీ వలసల ప్రభావానికి గురైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. వారిలానే టీడీపీ ఓటమి తర్వాత యామిని సోషల్ మీడియాలోనూ పోస్టులు తగ్గించారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆమె చేసిన పోస్టులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏదేమైనా త్వరలోనే ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కమలం తీర్ధం తీసుకుంటారట.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన యామిని పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
