కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మర్ రాష్ట్రాన్ని కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కార్ ప్రకటించడాన్ని దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. చైనా సహకారంతో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించేలా చేసిన పాకిస్తాన్‌కు యుఎన్‌వో దేశాల నుంచి చుక్కెదురు అయింది. ఒక్క చైనా, బ్రిటన్ మినహా ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నీ దాదాపుగా కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయాన్ని సమర్థించాయి. అమెరికా ఈ విషయంలో తటస్థంగా ఉండగా, రష్యా పూర్తిగా భారత్‌కు మద్దతు పలికింది. ప్రపంచదేశాలన్నీ…కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని….. సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికాయి. దీంతో కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు చేసిన భారత్‌ను ప్రపంచం దృష్టిలో ముద్దాయిగా నిలపాలన్న పాకిస్తాన్ పన్నాగం విఫలం అయింది. కశ్మీర్ విషయం తర్వాత మోదీ సర్కార్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై పీవోకేపై దృష్టిపెడుతుందని, అఖండ భారత్ సాధన బీజేపీతోనే సాధ్యమని కొందరు బీజేపీ నేతలు, మిత్ర పక్షం శివసేన నేతలు బహిరంగంగా ప్రకటించారు. తాజాగా పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కే పరిమితమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు పొరుగు దేశం ఆశ్రయం ఇవ్వకుండా ఉంటేనే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. హర్యానాలో ఆదివారం జరిగిన జనాశీర్వాద్ ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని ఆశించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని, దీనిపై పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ఎదుట రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఇక పాకిస్తాన్‌తో పీఓకేపైనే చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. బాలాకోట్ కంటే భారీ చర్యలకు భారత్ ఉపక్రమించిందని ఇటీవల పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలాకోట్‌లో భారత్ జరిపిన చర్యలను పాక్ ప్రధాని గుర్తించినట్టు ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ నిమిషాల వ్యవధిలో ఆర్టికల్ 370ను రద్దు చేసిందని, తాము ఎన్నడూ అధికార దాహంతో రాజకీయాలు చేయబోమని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రస్తావించిన మేరకు ఆర్టికల్ 370ను రద్దు చేసి ఎన్నికల హామీని నెరవేర్చామని చెప్పారు. మొత్తంగా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో చర్చలు జరిపే అవకాశమే లేదని..ఇక నుంచి కేవలం పీవోకేపై మాత్రమే చర్చలు జరుపుతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పడంతో పాకిస్తాన్ ఖంగు తింది. మున్ముందు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యాన్ని సహించేది లేదని…రాజ్‌నాథ్ సింగ్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా హెచ్చరించారు.