ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలతో వైయస్ జగన్.. దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో లక్షలాది మహిళల కన్నీరు తుడిచేలా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే మద్యం పాలసీ….పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల పథకాల్లో మద్యనిషేధాన్ని చేర్చిన జగన్..ఇప్పుడు అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయబోతున్నారు. మద్యాన్ని నియంత్రిస్తానని, అక్కా చెల్లెళ్ల కన్నీరు తుడుస్తాయని అని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.
అయితే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యాన్ని నియంత్రింస్తే మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పవు అన్న అధికారుల మాటలను బేఖాతరు చేసిన సీఎం జగన్ తాను ఇచ్చిన మాటకే కట్టుబడి మద్యం నిలిపేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతాలు పంపుతున్నారు. తాజాగా అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు సీఎం జగన్. ఈ నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఇక నుంచి ఏపీలో మద్యం నియంత్రం మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ పాలసీ వల్ల పట్టణాలు, పల్లెల్లో బెల్టు షాపులు పూర్తిగా రద్దు కానున్నాయి. ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఇప్పుడున్న దుకాణాల్లో తొలి విడతగా 20.09% దుకాణాలను తగ్గించుకుంటారు. అంటే నాలుగు వేల పైచిలుకు ఉన్న ప్రస్తుత దుకాణాలు 3500 కు తగ్గిపోనున్నాయి. అదేసమయంలో మద్యం దుకాణాల సమయాన్ని కుదించనున్నారు. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉండే మద్య దుకాణాలు అక్టోబరు నుంచి ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో సాగడంతోపాటు ఉదయం 10 నుంచి రాత్రి తొమ్మిది వరకే ఉంటాయి.
అంతే కాదు వైన్స్ షాపులకు ఇప్పుడు ఇస్తున్న పర్మిట్ రూమ్‌లకు స్వస్థి పలికారు. అంటే వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూంలలో కూర్చుని తాగే అవకాశం ఇక మందుబాబులకు ఉండదు. ఒక వేళ మద్యం కొనుక్కున్నా…ఇంటికి వెళ్లి తాగాల్సిందే. ఇంటిలో ఎక్కువ తాగే పరిస్థితి ఉండదు. ఈ చర్యల ఫలితంగా మద్యం ప్రియుల్లో కొద్ది మేర మార్పు వస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో మందుతాగే వారి జేబులు గుల్లకాకుండా ఎంఆర్ పీ ధరలకే విక్రయించేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా క్రమంగా దశల వారీగా మద్యాన్ని నియంత్రించాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నూతన ఎక్సైజ్ పాలసీతో బెల్టు షాపులు పూర్తిగా రద్దు అవుతుండడంతో మహిళల కన్నీళ్లు కొంత వరకైనా తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో మద్యం మహమ్మారికి బలైపోతున్న కుటుంబాల్లో వెలుగులు నింపేలా, బాధిత మహిళల కన్నీళ్లు తుడిచేలా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.