అమెరికా పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా (ఐఏఎస్), నీల్‌కాంత్ అవ్హద్ (ఐఏఎస్) కూడా జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా – ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు జగన్ విందులో పాల్గొన్నారు. అలాగే అమెరికా పర్యటనలో మూడురోజులు వ్యక్తిగత పనులు ఉండటం వల్ల జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే స్వయంగా ఖర్చులు భరిస్తూ పర్యటించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఈ క్రమంలో జగన్ తో గిలీడ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు సమావేశామయ్యారు. ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జగన్ వారిని కోరారు. హై అండ్ ఔషద తయారీకి రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని, ఏపీలో పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఒక్క దరఖాస్తు మాత్రం చాలని, మిగిలినవన్నీ మేం చూసుకుంటామన్నారు. చేయూతనిస్తామని, కావాల్సినవన్నీ సమకూరుస్తామన్నారు. అయితే అమెరికాలో జగన్ కొత్త లుక్ లో కనిపించారు. వైట్ కలర్ షర్ట్ పై బ్లాక్ కలర్ బ్లేజర్ తో సీఎం సినీ హీరోని తలపిస్తున్నారు.. గతంలో ఇజ్రాయెల్‌లో కూడా సరికొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ప్యాంట్, చొక్కా ధరించి సాధారణంగా ఉండే సీఎం విదేశాల్లో స్టయిల్ మార్చి ఇన్ షర్ట్ లో కనిపించారు. ఇప్పుడు అమెరికాలో మాత్రం సూట్ తో కొత్తలుక్ లో ఇరగదీస్తున్నారు. గతంలో వైఎస్ కూడా రాష్ట్రంలో ఉన్నపుడు పంచెకట్టులో ఉన్నా విదేశాలకు వెళ్లినపుడు సూటు, బూటు వేసుకునేవారు.