తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన బాహుబలి గాయత్రి పంప్‌హౌస్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇంతకు ముందెన్నడూ లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్థాల ప్రకారం, నీటి పంపింగ్ లక్షం, పరిమాణం..ఇలా ఏ ప్రకారం చూసినా, గాయత్రి పంపుహౌజ్ ఇంజనీరింగ్ కళాఖండం. ఈ పంప్‌హౌస్ ఘనకీర్తి ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా న్యూయార్క్ టైమ్స్ పలు కథనాలను ప్రసారం చేసింది.
న్యూయార్క్‌లోని ఓ కూడలిలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘనతను ప్రపంచానికి తెలిసేలా పలు వార్త కథనాల్ని ప్రసారం చేసింది. రోజుకు ఐదుసార్ల చొప్పున మొత్తం మూడు రోజుల పాటు గాయత్రి పంప్‌హౌస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పదనాన్ని, విశిష్టతలను వివరిస్తూ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్టోరీలను ప్రసారం చేసింది. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో చేరే అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయని ప్రశంసించింది. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ప్రపంచంలోనే అత్యధిక సామర్థం ఉన్న పంపులు 139 మెగావాట్లను ఉపయోగిస్తూ 111 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాలన్న సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించారు.
ఒక్కో మిషన్ వారీగా చూస్తే సామర్థం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే పెద్ద మిషన్. ఒక మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతి పెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంపుహౌజ్‌లలో కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ ఇంత పెద్దది లేదు.