మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మరణం నుంచి కోలుకోకముందే.. మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు బీజేపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 9 న అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు జైట్లీని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్వీ ‘జైట్లీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మంజిందర్ ఎస్ సిర్సా కూడా జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జైట్లీ.. తనకు మెంటర్ వంటి వారని, అంతే కాకుండా 1984 సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం జరగాలని పోరాడిన వ్యక్తి అంటూ ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైట్లీని శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌లు కూడా ఆసుపత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆగస్టు 9 రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని బీజేపీ శ్రేణులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.