బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల భద్రత కోసమే డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామంటూ ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు, టీడీపీ నేతలు డ్రోన్ల వినియోగాన్ని రాజకీయం చేస్తున్నారంటూ అనిల్ కుమార్ మండిపడ్డారు. తాజాగా మరో మంత్రి ఈ అంశంపై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఇల్లు నీటిలో మునిగినా.. గాల్లో ఎగిరినా మాకేం …అసలు చంద్రబాబు ఇల్లు ఉంటే ఏంటీ..? పోతే ఏంటీ..? చంద్రబాబు కోన్ కిస్కా గొట్టం అంటూ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
వరద ముంపుకు గురైన చంద్రబాబు అక్రమ నివాసం గురించి మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రస్తుతం చంద్రబాబు ఇల్లు పాడుబడిన బంగ్లా అని, దయ్యాల కొంప, రాత్రి 7 కాగానే చంద్రబాబు ఇంట్లో లైట్లు ఆర్పేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కరకట్టపై డ్రోన్ల వినియోగానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదని, వరద పరిస్థితిపై అంచనా వేసేందుకు డ్రోన్లతో చిత్రీకరిస్తుంటే అది తప్పా అని నాని ప్రశ్నించారు. డ్రోన్ కెమెరాల వినియోగాన్ని తప్పు పడుతూ టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఇక నీటి విడుదలపై మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను నాని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. దేవినేని నోటికి వచ్చినట్టు వాగుతాడనే విషయం అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. వరదపై రివ్యూ చేయకుండా జగన్ అమెరికాకు వెళ్లాడు అన్న టీడీపీ నేతలపై ఆరోపణలపై మంత్రి నాని స్పందించారు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు కూడా సీఎం జగన్ వరదపై సమీక్ష చేశారని, ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి మా మంత్రి అనిల్ కుమార్ చాలు… వరదలపై రివ్యూ చేయాలంటే ఏంటీ..? టీడీపీ సన్నాసులను పిలిచి ప్రకాశం బ్యారెజ్ మీద చర్చించాలా..? అంటూ నాని మండిపడ్డారు. మరి వరద వస్తుందని తెలిసి చంద్రబాబు హైదరాబాద్ ఎందుకెళ్లారు…? ప్రకాశం బ్యారేజీపై కుర్చీ వేసుకుని కూర్చోవచ్చుగా..? అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని. మొత్తంగా చంద్రబాబు కోన్ కిస్కా గొట్టం అంటూ కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ‌్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.