ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే కారణంతో కొన్ని నిర్మాణాలు ఆగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చొరవతో తిరుపతిలో ఆగిన గరుడవారధి పనులు పునఃప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రూ.684 కోట్లతో చేపట్టిన స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ (గరుడ వారధి) నిర్మాణం కూడా ఉంది. లక్షలాది మంది భక్తులు, నగర వాసుల ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే భూమన పసిగట్టారు. ఈ సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనే ఆశయంతో వెంటనే సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక ఇవ్వడం, శనివారం పనుల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టడం చకాచకా జరిగిపోయాయి. ఈ పనులకు సంబంధించి ఎమ్మెల్యే భూమనతో పాటు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష్ భూమిపూజ చేశారు. 2006లో గరుడ పనులకు వైఎస్ హయాంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, అది కార్యరూపం చెందడానికి ఇంతకాలం పట్టిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు.ఏది ఏమైనా ఆఫ్కాన్ సంస్థ గరుడ వారధి పనులను ఎలాంటి ఆటంకం లేకుండా చేపట్టేందుకు మార్గం సుగుమం చేసిన భూమన చొరవను నగరవాసులు, భక్తులు ప్రశంసిస్తున్నారు.
