ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 8.70 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండడంతో జూరాలకు ఉధృతంగా వరద చేరింది. దీంతో అన్ని గేట్లను ఎత్తి 8.63 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ లోకి నీటిని విడుదల చేశారు అధికారులు. సాగర్ డ్యాంకు భారీగా వరద చేరడంతో తొలుత 4 గేట్లతో దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కొద్దిసేపటి తర్వాత 9 గేట్లు తెరిచారు. అయినా వరద ఉధృతి తగ్గకపోవడంతో 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.