నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురం,తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని కేసీఆర్ కుటుంబం దర్శించుకున్న అనంతరం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి వచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పట్టుదల ఉన్న యువనాయకుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అదిసాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. తన కుమార్తె నగరి ఎమ్మెల్యే రోజా తనకు మంచి ఆతిథ్యమిచ్చారని, అన్నదాత, సుఖీభవ అంటూ ఆమెను దీవించారు.
ఆరు దశాబ్ధాలుగా నీటి ఎద్దడిను , రాయలసీమ ప్రాంత ప్రజల ఇబ్బందులు తనకు తెలుసునని.. వందశాతం తన ఆశీస్సులు, సంపూర్ణ సహకారం ఏపీకి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.నీళ్ల విషయంలో ఇప్పటికే తాను, జగన్‌తో చర్చలు జరిపామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్టులు నీళ్లతో కలకలలాడుతున్నాయని, ఆ నీరు వృధా కాకుండా ప్రజలకు ఉపయోగపడాలని ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. గత 60 ఏళ్ల తెలుగువారి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని జగన్‌తో కలిసి లిఖించబోతున్నామని కేసీఆర్ అన్నారు. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చునని, మరి కొందరికి జీర్ణం కాకపోవచ్చునని దానికి తాము చేయగలిగిందేమీలేదని అన్నారు. ప్రజల మద్దతు ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ల కోరిక నెరవేరుస్తామని, రాయల సీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడు ఇచ్చిన సర్వ శక్తులు ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.