వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు జేఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం 95వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అధిక రద్దీ వద‍్ద సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు జేఈవో తెలిపారు. కాగా శ్రీవారికి హుండీ ఆదాయం ద్వారా రూ.2.61 కోట్లు లభించాయి. తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి జయరామ్, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం కోన రఘుపతి మాట్లాడుతూ… స్పీకర్ స్థానాన్ని కోడెల శివప్రసాదరావు దుర్వినియోగం చేశారని విమర్శించారు. కోడెలపై సొంతపార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు.మంత్రి జయరాం మాట్లాడుతూ… గ్రామ వాలంటర్లు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాల బిల్లు తెచ్చామని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం శుభపరిణామం అని కడియం శ్రీహరి అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం నుంచి 13వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండోరోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.