తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరవాసులకు నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు నగరంలో 33 శాతం గ్రీన్ కవరేజీ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా రూ. 17.75 కోట్ల వ్యయంతో సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్ బ్లాక్‌ల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధిచేస్తున్నారు. అలాగే హరితహారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 3084 ఖాళీ స్థలాల (1727ఎకకాల విస్తీర్ణం)ను బల్దియా అధికారులు మొక్కలు నాటేందుకు ఎంపిక చేశారు.
వీటితో పాటు 873 పార్కుల్లో అందుబాటులో ఉన్న 696 ఎకరాల ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. వీటితోపాటు గ్రేటర్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల ఖాళీస్థలాల్లో ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించారు.
అలాగే చెరువుల గట్టు, వాకింగ్ ట్రాక్‌లకు ఇరువైపులా, శ్మశానవాటికలు తదితరచోట్ల కూడా ఖాళీస్థలాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది డివిజన్‌కు రెండు లక్షల చొప్పున మొత్తం మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్‌లో మేజర్ పార్కులు 17 ఉండగా, మధ్య, చిన్నతరహా పార్కు లు 873, ఇవికాకుండా 331 ట్రీపార్కులు ఉన్నాయి. అయితే ఈ ఏడాది హరితహారంలో భాగంగా కొత్తగా 616 ఖాళీ స్థలాల్లో మొక్కలునాటి వాటిని ట్రీపార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.