ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వాతావరణం చల్లగా ఉంది.. ఇలాంటి స్థితిలో వేడి వేడిగా.. కమ్మగా.. చేపల పులుసు చేసుకుని తింటే.. ఎంత మజాగా ఉంటుందో తెలుసు కదా.. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా
అద్భుతంగానే ఉంటుంది. అయితే ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని 2016లో పలువురు అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.
2. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
4. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఓ అధ్యయ వివరాలను ప్రచురించారు.
5. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.