ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు తండ్రీ కొడుకులు. మొన్నటికీ మొన్న కియా నుంచి తొలి కారు..అంతా దార్శనికుడు చంద్రబాబు కష్టం అంటూ చేసిన ట్వీట్‌తో చినబాబును నెట్‌జన్లు చెడుగుడు ఆడుకున్నారు. కియా నుంచి తొలి కారు అంటూ ఎన్నికలకు ముందు నువ్వు, నీ బాబు లాంచ్ చేసిందేంటీ…అప్పుడే అనుకున్నాం..కారుకు బ్లాక్ క్లాత్ చుట్టినప్పుడే అది కియా కారు కాదని డౌట్ వచ్చింది…ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో లాంచ్ చేసిందే కియా తొలి కారు..అంటూ చినబాబును సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. తాజాగా ఆశావర్కర్ల పరిస్థితి ఇది అంటూ….ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. పోస్ట్ చేస్తూ పెట్టిన ఫోటోలో మొదటి ఫోటో జగన్‌కు పాలాభిషేకం చేసిన ఫోటో కరెక్ట్‌గానే పెట్టిన చంద్రబాబు రెండో ఫోటో విషయంలో మాత్రం తప్పులో కాలేశాడు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం తెలంగాణలో ఆశావర్కర్లు చేసిన ఆందోళన ఫోటో పెట్టి అడ్డంగా దొరికిపోయాడు బాబు. దీంతో నిన్నంతా నెట్‌జన్లు చంద్రబాబుగారిపై ఫుల్లుగా సెటైర్లు వేశారు. అంతే కాదు…మొన్నటికి మొన్న పాలిచ్చే ఆవును కాదని, దున్నపోతు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అవును.. పాలిచ్చే ఆవు ఎవరో, దున్నపోతు ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టే…దున్నపోతు ప్రభుత్వాన్ని వదులుకుని, పాలిచ్చే ఆవులాంటి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారంటూ నెట్‌జన్లు, వైసీపీ నేతలు బాబుపై విరుచుకుపడ్డారు.
తాజాగా ఆశా వర్కర్లకు సంబంధించి చంద్రబాబు చేసిన ట్వీట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు చేసిన అబద్దపు ప్రచారాల వల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను మెచ్చుకోకున్నా ఫర్వాలేదు గానీ.. ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదని, రక్తాన్ని పీల్చే జలగ అని విమర్శించారు. తమ దేశంలో చంద్రబాబులా మాట్లాడితే మెంటల్ ఆసుపత్రిలో వేస్తారని స్విట్జర్లాండ్ మంత్రి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. గతంలో తెలంగాణలో జరిగిన ఆందోళనలో ఫోటో పెట్టి అబద్దాలు చెప్పారని, బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి తప్పుడు ట్వీట్లతో దాడి చేస్తున్న తండ్రీ కొడుకులకు నెట్‌జన్లతో పాటు వైసీపీ నేతలు కూడా కౌంటర్లతో చుక్కలు చూపిస్తున్నారు. అయ్యా బాబుగారు..మనకు ఎందుకు వచ్చిన గోల…ఓ నాలుగు రోజులు గమ్మునండలేరా…ఎందుకు అనవసరపు ట్వీట్లు, పోస్టులు పెట్టి అడ్డంగా దొరికిపోయి బద్నాం అవుతున్నారంటూ…తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.