నవ్యాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘డిప్లొమాటిక్ అవుట్ రీచ్’ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీలు లేకపోవడం ఏపీకి ఇబ్బందికరమే అయినప్పటికీ..ఇక్కడ తీర ప్రాంతం అతిపెద్ద వనరు అని పేర్కొన్నారు.
‘‘ మా బలహీనతలు మాకు, మీకు తెలుసు. సుదీర్ఘ తీరప్రాంతం, మంచి వనరులు మా సొంతం. మాది సుస్థిర ప్రభుత్వం.. కేంద్రం సహకారం కూడా ఉంది. ఇటీవల చట్టసభల్లోనూ చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలన్నీ చెబుతున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. దిల్లీ తర్వాత ఈ స్థాయిలో ఇంతమంది దౌత్యవేత్తల సమావేశం కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అనుకుంటున్నానని జగన్ అన్నారు.