మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మా స్వరాజ్ మరణంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో సుష్మా స్వరాజ్‌కు ఉన్న అనుబంధాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల ఆత్మ బలిదానాలకు కన్నీరు పెట్టి, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ బిల్లు పెట్టండి..మేము మద్దతు ఇస్తామని ప్రకటించిన చిన్నమ్మగా సుష్మాను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏపీ ప్రజలు శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా సుష్మా మరణానికి నివాళులు అర్పిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా సుష్మా మరణంతో తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా స్వర్గీయ వైయస్ కుటుంబానికి, ప్రస్తుత సీఎం వైయస్ జగన్‌కు మద్దతుగా సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో మాట్లాడిన సంఘటనను వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. సుష్మాకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. పార్లమెంట్‌లో తరచుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల గురించి ప్రస్తావించేవారు. ప్రత్యేకించి- వైఎస్ జగన్ అంటే సుష్మా ఎంతో ఆప్యాయత చూపించేవారు. వైయస్ జగన్‌ను సొంత కుమారుడిలా చూసుకునే వారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే ఈ విషయం ఏనాడూ పెద్దగా బయటికి రాలేదు గానీ.. వైఎస్ జగన్ పై సీబీఐ కేసులు నమోదు చేయడాన్ని సుష్మాస్వరాజ్ నిండు సభలో తప్పుపట్టారు. ఏ పాపం చేశాడని వైఎస్ జగన్ పై కేసులు నమోదు చేశారు. ఏం చేశాడని వైఎస్ జగన్ ను భయానకంగా హింసించారని ఆమె కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది.
2009 ఎన్నికల అనంతరం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లోపే వైయస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ సందర్భంగా వైయస్ కుమారుడు వైయస్ జగన్‌ను సీఎంను చేయాలంటూ 150కు పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎమ్మెల్యేల అభిప్రాయాలను పట్టించుకోకుండా రోశయ్యను సీఎంగా నిర్ణయించింది. అదే సమయంలో తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను చేపట్టారు. ఓదార్పు యాత్రతో వైయస్ జగన్‌కు క్రేజ్ పెరుగుతుందనే భావనతో సోనియాగాంధీ ఓదార్పు యాత్రకు అనుమతి లేదు. దీంతో వైయస్ ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీని వీడి..కొత్తగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసారు. తనతో పాటు నడిచిన 16 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికలలో గెలిపించుకున్నారు. దీంతో భయపడిన నాటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ , కాంగ్రెస్ అధిష్టానం కుమ్మక్కై అక్రమ కేసుల పేరుతో సీబీఐని ఉసిగొల్పి వైయస్ జగన్‌ను వేధించాయి. 16 నెలల పాటు జైలుశిక్ష పడేలా చేశారు. జగన్ ఆస్తులను జప్తు చేశారు.
ఈ సందర్భంగా పార్లమెంట్‌లో నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ వైయస్ కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలను తరచుగా ఎండగట్టేవారు. .. వైఎస్ జగన్ పై నమోదైన ఆస్తుల కేసుల వ్యవహారంపై సభలో మాట్లాడేవారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి, వైఎస్ జగన్ పై అక్రమంగా కేసులు నమోదు చేయించారని, ఆయన కుటుంబంపై పగ సాధిస్తున్నారంటూ సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్నారని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రె్ ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేసేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం అంటే ప్రాణం ఇచ్చేవారని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో పోల్చుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ అగ్ర నాయకులను అధికంగా అభిమానించే వారని అన్నారు. అలాంటి నాయకుడి కుమారుడిని కాంగ్రెస్ పార్టీ భయానకంగా హింసించిందని అన్నారు. పార్టీలో కొనసాగితే ఒక రకంగా.. పార్టీని వీడితే ఇంకోరకంగా చూస్తుందని ఇదీ ఆ పార్టీ తీరు అని సుష్మాస్వరాజ్ సభలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుష్మాస్వరాజ్ కన్నుమూసిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేశారు. మొత్తానికి దేశం గర్వించదగిన నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు వైయస్ కుటుంబంతో ఉన్న అభిమానం ఎంత ఉందో…ఇప్పుడు బయటకు తెలిసింది. కష్టకాలంతో వెన్నంటే నిలిచిన మంచి మనసున్న నేత…సుష్మా అని వైయస్ఆర్ అభిమానులు ఆమెను కొనియాడుతున్నారు.