బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మాసర్వాజ్ గుండెపోటుతో మరణించారు. ఆ మహానాయకురాలికి రాష్ట్రపతి కోవింద, ప్రధాని మోదీ నుంచి అన్ని పార్టీల నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు. అలానే మరో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సుష్మా స్వరాజ్‌ను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సోనియా గాంధీ, ఒడిశా సీఎం సుష్మా స్వరాజ్ ఇంటికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. కాగా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు. సుష్మా స్వరాజ్ నాయకత్వ లక్షణాలు, వాగ్ధాటి, గమనించిన మోదీ గత ప్రభుత్వ హయాంలో కీలకమైన విదేశాంగ శాఖను అప్పగించారు. విదేశాంగ మంత్రిగా సుష్మా రాణించిన తీరు…పాకిస్తాన్ కుటిల బుద్ధిని అంతర్జాతీయ వేదికలపై పదునైన డైలాగులతో ఎండగట్టిన తీరు , అన్నింటికి మించి సుష్మా చూపించే మానత్వం మోదీని ఆకట్టుకునేది. అందుకే సుష్మా మరణంతో మోదీ భావోద్వేగానికి గురయ్యారు.