భారత పార్లమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ గురించి మంగళవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. వాడీ వేడీగా జరిగిన ఈ చర్చలో 370 యాక్ట్ రద్దుపై అన్ని పార్టీలు తమ తమ గళం వినిపించాయి. దీనికి కొన్ని పార్టీలు మద్దతు తెలుపగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అయితే ఈ చర్చ మొత్తంలో మహారాష్ట్రకు చెందిన మాజీ నటి, స్వత్రంత్ర ఎంపీ నవ్‌నీత్ కౌర్ ఇచ్చిన స్పీచ్ తెలుగు వారిని ఆకట్టుకుంది. దీనికి కారణం ఆమె తెలుగు భాషలో మాట్లాడడమే. ముందుగా తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని ప్రధాని మోదీ చాలా సందర్భాలలో చెప్పారని, కానీ నేడు అది నిజమని ఆయన నిరూపించారని ఆమె అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి పది రోజుల ముందే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని నవ్‌నీత్ కౌర్ అన్నారు.ఆర్టికల్ 370కి సంబంధించిన బిల్లును సమర్థిస్తూ ఆమె మాట్లాడారు. ‘‘ఎప్పుడెప్పుడు వెళ్లి నేను కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలా అన్న ఆలోచనతో రాత్రంతా నాకు నిద్ర రాలేదు. ఈ చరిత్రాత్మక బిల్లును సమర్థించడం యువ ఎంపీల బాధ్యత’’ అని ఆమె అ,న్నారు. ఈ సందర్భంలో ఓ తెలుగు ఎంపీ అడ్డుతగలబోగా.. నవనీత్ కౌర్ సదరు ఎంపీకి తెలుగులోనే సమాధానం చెప్పారు. ‘రెండు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. నాకు కూడా తెలుగు తెలుసు. మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు ఒప్పుకుంటా. నేను కూడా అపోజిషన్‌లోనే ఉన్నా. ఇండిపెండెంట్‌గా ఉన్నా. నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డు రావద్దు’ అంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.