నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల అంశం, పాలనా విధానం, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది.
ఈ క్రమంలో గ్రామ వలంటీర్ల నియామకం చేపడుతూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా దరువు సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం జరిగింది. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, రైతులు అందరినీ దరువు పలకరించింది. పట్టణాలు, అర్బన్ ప్రాంతాలతోపాటు రూరల్ గ్రామాల్లోనూ దరువు సర్వే నిర్వహించింది. మొత్తం 50వేలమందిని ఈ సర్వేలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది.
ఇందులో భాగంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థపై ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఈ అంశంపై దాదాపుగా 71 శాతం మంది ప్రజలు చాలా మంచి కార్యక్రమం అని, 26శాతం వద్దు అని, మరో 3శాతం మంది ఇప్పుడే చెప్పలేం అని సమాధానం ఇచ్చారు. అయితే 71శాతం ప్రజలు మాత్రం ప్రభుత్వ పధకాలను డోర్ డెలివరీ చేయడం గొప్ప విషయమని, పేదలకు అండగా ఎవరూ లేని వారికి ప్రభుత్వమే ఇంటింటికీ అన్ని పధకాలు అందించడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. ముఖ్యంగా జన్మభూమి కమిటీల ద్వారా తామెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. గ్రామ వలంటీర్లు సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో పనిచేయాలని ప్రజలు కోరారు.