నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది.
గతంలో దరువు నిర్వహించిన సర్వేలన్నీ వందకు వంద శాతం నిజమయ్యాయి. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గెల్చుకుంటుందని ప్రకటించిన దరువు సర్వే నిజమైంది. 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు గెల్చుకుంటుందని దరువు సర్వే ఫలితాలను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు గెల్చుకుని చరిత్ర తిరగరాసింది. ఇక 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే…దరువు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పింది దరువు. సర్వేల్లో ప్రజలనాడీ పట్టుకోవడంలో దరువుది అందె వేసిన చేయి. ప్రామాణికత, కచ్చితత్వం, పారదర్శకత పాటించడం మా దరువుకే సొంతం.
వైయస్ జగన్ 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు సమగ్ర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, రైతులు..ఇలా అందరినీ దరువు పలకరించింది. పట్టణాలు, అర్బన్ ప్రాంతాలతోపాటు రూరల్ గ్రామాల్లోనూ దరువు సర్వే నిర్వహించింది. మొత్తం 50వేలమందిని ఈ సర్వేలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీల అవినీతిని సీఎం జగన్ తగ్గించగలిగాడా అనే అంశంపై ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఈ అంశంలో దాదాపు 90 శాతం అవినీతి కంట్రోల్ అయిందని చెప్పగా ముక్తకంఠంతో చెప్పారు. 7 శాతం మాత్రం అవినీతి కంట్రోల్ కాలేదని చెప్పగా, 3 శాతం ఓకే ఫర్వాలేదు, అవినీతి కొద్ది మేర కంట్రోల్ అయిందని చెప్పారు. సీఎం జగన్ పాలన చేపట్టిన రోజు నుండి అవినీతి లేకుండా పాదదర్శక పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా, ఒక రాజ్యాంగబద్ధమైన జ్యుడిషియరీ కమిటీ ఆమోదించిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణ పనులకు టెండర్లు పిలుస్తామని ప్రకటించడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో అవినీతి దాదాపుగా కంట్రోల్ అయింది. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల నుంచి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల వరకు జరిగిన అవినీతితో విసిగిపోయిన ప్రజలకు ప్రభుత్వ పథకాలు పారదర‌్శకంగా అమలవుతుండడం, గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల పీడ వదలడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జగన్ పాలనలో ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి తగ్గిందని 90 శాతం ప్రజలు భావించడం గమనార్హం.