దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే …మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైందంటూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమల్‌హాసన్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370, 35ఏలకు ఓ ప్రత్యేకత ఉన్నదని, వాటిలో మార్పులు చేయాలనుకుంటే, ముందుగా చర్చల ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలన్నారు. యావత్ దేశమంతా ఆర్టికల్ 370 రద్దుపై హర్షం వ్యక్తం చేస్తుండగా సెక్యులరిస్ట్ ముసుగులో కమల్ హాసన్ లాంటి నాయకులు ఆర్టికల్ 370 రద్దును మూర్ఖంగా వ్యతిరేకిస్తున్నారని నెట్‌జన్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. గతంలోనే నాథూరాం గాడ్సేనే తొలి టెర్రరిస్ట్‌గా పోల్చి కమలహాసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.. తాజాగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం ద్వారా మరోసారి చిక్కుల్లో పడ్డారు. మొత్తానికి 370 ఆర్టికల్ రద్దుపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రగులుతోంది. మరి మున్ముందు కమల్ హాసన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారో లేదా…ఆర్టికల్ 370పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాడో చూడాలి.
