గత వారం రోజులుగా కాశ్మీర్‌పై జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణమాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. హోంమంత్రి ప్రకటనతో రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్ అంశపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, వివాదాస్పదంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దయింది. గత వారం రోజులుగా భద్రతా బలగాల మోహరింపుతో కల్లోలంగా మారిన కశ్మీర్ వ్యవహారం కీలక ప్రకటనతో ముగిసింది. కాగా తాజా బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం అనంతరం అమల్లోకి రానుంది. దీనిని పార్లమెంట్ ఉభయ సభలు 2/3 మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంది. అమిత్ షా ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యంగాన్ని ఉల్లంఘించి ఈ నిర్ణయం తీసుకుందని తీవ్రంగా మండిపడ్డాయి.
కాగా అమిత్ షా ప్రకటనకు ముందు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రిమండలి భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా దేశానికి సమస్యగా మారిన కశ్మీర్ ప్రత్యేక హక్కుల అధికరణను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీని కోసం ఎన్నో రోజులగా తీవ్ర కసరత్తు చేసిన మోదీ ప్రభుత్వం.. కీలక సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించింది. కశ్మీర్‌కు సమస్యాత్మకంగా మారిన ఆర్టికల్ 35ఏ, 370 అధికరణలను రద్ద చేస్తామని గత ఎన్నికల సమయంలో అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పూర్తి బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈమేరకు కీలక ప్రకటన చేసింది. అయితే ఆర్టికల్ 35 ఏ ప్రకారం కాశ్మీర్‌కు చెందిన వారే మిగతా రాష్ట్రాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటే…వారికి రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన విద్యా, ఉద్యోగ పరమైన రిజర్వేషన్లు చెల్లవు. దీంతో ఈ ఆర్టికల్ 35 ఏ ను రద్దు చేయాలంటూ కొందరు సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించారు. ఆర్టికల్ 35 ఏ పై అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పదమైన ఆర్టికల్ 370తో పాటు, 35 ఏ ఆర్టికల్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం..కశ్మీర్‌లో తీవ్ర ప్రకంపనలు రేపే అవకాశం ఉంది. అందుకే అల్లర్లు, హింసాకాండ చెలరేగకుండా కేంద్రం కశ్మీర్‌లో పెద్ద ఎత్తున సైనిక దళాలను మోహరించింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేయించింది. కశ్మీర్ అంతటా 144 సెక్షన్ విధించింది. అమరనాథ యాత్రికులతో పాటు టూరిస్టులను కశ్మీర్ నుంచి పంపించి వేసింది. మరి ఆర్టికల్ 370 , 35 ఏ రద్దుపై కశ్మీర్ ప్రజానీకం ఎలా స్పందిస్తుందో చూడాలి.