2014లో భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా 2014, జూన్ 2 న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి వరకు 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశ భౌగోళిక స్వరూపం…29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. తాజాగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు కశ్మీర్ రాష్ట్రాన్ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్‌ను అసెంబ్లీలేని కేంద్ర పాలితప్రాంతంగా విభజించింది. దీంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్ర జాబితాలోంచి తొలిగిపోయింది. కేంద్ర పాలిత ప్రాంత జాబితాలో రెండు పెరిగాయి. ఇది వరకు ఉన్న 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్తగా జమ్ము, కశ్మీర్, లఢక్‌లు అయ్యాయి. దీంతో మొత్తం 9 కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలుగా భారతదేశ భౌగోళిక స్వరూపం మారింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాల జాబితాలో 29 వ స్థానంలో ఉన్న తెలంగాణ 28 వ స్థానంలోకి వచ్చి చేరింది.
