సమర్థవంతమైన పాలనతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో 30 ఏళ్ల వరకు సీఎంగా కొనసాగుతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం చౌడేపల్లె మండలంలోని 19 పంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీల్లో ఇప్పటికే 70 శాతం అమలు చేశామని నీతివంతమైన పాలన అందజేసి జగన్ ప్రజల గుండెల్లో నిలుస్తారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం నుంచి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీలను పెద్దిరెడ్డి గెలిపించగలిగారని దేశంలోనే ఈ కాంబినేషన్ లేదన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా మంత్రి సూచించే వ్యక్తులను గెలిపించి మంత్రి రుణం తీర్చుకుందామన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంకా పెద్ద పదవికి అవకాశం ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సౌకర్యాలు కల్పించే పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్న గొప్పవ్యక్తి పెద్దిరెడ్డి అని తెలిపారు.
