తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు 2 వ తేది నుండి తల్లి పాల వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8:00 గంటలకు నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా వద్ద ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో వాక్ నిర్వహించడం జరిగింది.
రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలుగొని,తల్లి పాల వారోత్సవాల వాక్ ను ప్రారంభించారు.””డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు”” అనే స్లోగన్ తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… దేశంలో మొట్టమొదటి తల్లి పాల బ్యాంక్ ను నీలోఫర్ హాస్పిటల్ లో నిర్వహించడం జరుగుతోంది అని అన్నారు.
బిడ్డ పుట్టిన గంట లోపల అమృతం వంటి తల్లి పాలు అందించడం ఎంతో శ్రేయస్కరమని ఆయన చెప్పారు. ఈ రోజుల్లో చాలా మంది పుట్టిన బిడ్డలకు డబ్బా పాలను అందిస్తున్నారు.ఇది బిడ్డ పెరుగుదల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, అన్నిరకాల వ్యాధి నిరోధక శక్తిని తట్టుకొనే శక్తి కేవలం తల్లి పాలకు మాత్రమే ఉంది డబ్బా పాలకు కాదు అని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను, తల్లులను, పుట్టిన బిడ్డలని అన్ని రకాలుగా ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలతో గొప్పగా ఆదరిస్తున్నదంటూ మంత్రి మల్లారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధాత్రి ఫౌండర్ సంతోష్ కుమార్, సుషీనా హెల్త్ ఫౌండేషన్, ,ప్రసన్న, నీలోఫర్ కో. ఆర్గనైజర్స్ ,డా. హిమబిందు,వివిధ హాస్పిటల్స్ డాక్టర్లు ,హిమవంత్ ,రవి తదితరులు పాల్గొన్నారు.