హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులను పరిశీలించడంతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని అమీర్‌పేట, ఖైరతాబాద్, బల్కంపేట్ తదితర ప్రాంతాల్లో మేయర్ రామ్మోహన్ పర్యటించి జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రిలీఫ్ బృందాలు చేపట్టిన సహాయక కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల నగరవాసులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు రోడ్లను తక్షణమే మరమ్మతులు నిర్వహించడానికి ప్రత్యేకంగా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ విభాగాలకు చెందిన మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కూడా నగరంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా కూలిన చెట్లను వెంటనే తొలగించడంలో డి.ఆర్.ఎఫ్ బృందాలు తగు పరికరాలతో సమర్థవంతంగా పనిచేశాయని పేర్కొన్నారు. నేడు ఉదయం నుండి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు అడిషనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, జోనల్, డిప్యూటి కమిషనర్లు క్షేత్రస్థాయిలో రహదారుల పునరుద్దరణ పనులను పర్యవేక్షించారని స్పష్టం చేశారు. నీట మునిగిన కాలనీలు, బస్తీల్లో సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
