పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాకమూరి మారుతి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించేవాడు. కోడెల శివరామ్ అండదండలతో యథేచ్ఛగా తన అనుచరులతో బెట్టింగ్ నిర్వహింపచేయడం, సమయానికి డబ్బులు ఇవ్వని వారిపై గూండాలతో దాడులు చేయటం వంటి చర్యలకు పాల్పడేవాడు.
మాజీ స్పీకర్ కోడెల అండ పుష్కలంగా ఉండటంతో స్థానిక పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించేవారు. రెండేళ్ల క్రితం రూరల్ ఎస్పీగా పనిచేసిన వెంకటప్పలనాయుడు మారుతి, అతని అనుచరులను అరెస్ట్ కేసు నమోదు చేశారు. విచారణలో మారుతికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అతడి వద్ద పందేలు ఆడి నష్టపోయిన బాధితులు గత నెలరోజుల క్రితం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వలపన్ని బీసీ కాలనీలో ఓ గృహంలో బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా దాడులు చేశారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన మారుతి పరారీ అవగా, అతని అనుచరులు ఖాజా, నాగూర్‌లను అరెస్ట్ చేశారు.