మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పలువురు కేంద్రమంత్రులను కలిసిన పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణలో గురుకుల పాఠశాలల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. పెద్దపల్లిలో కేంద్రీయ విద్యాలయం, జగిత్యాలలో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.. అటు రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిచాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.