టీడీపీలో మరోసారి ఆగస్టు సంక్షోభం రానుందా…టీడీపీ దుకాణం బంద్ కానుందా…ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…మరోసారి ఆగస్టు సంక్షోభం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను స్వయానా అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కుంచుకున్నది ఈ ఆగస్టు నెలలోనే. అప్పటి ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్‌ను అవమానకరరీతిలో పదవీచ్యుతుడిని చేస్తే ఇప్పుడు రాబోయే ఆగస్టు సంక్షోభం టీడీపీ పతనానికి నాంది అని స్వయంగా తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు దారుణమైన ఓటమిని టీడీపీ చవి చూసింది. తెలుగుదేశంలోనే ఉంటే భవిష్యత్ ఉండదని తెలిసి ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజన చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు తదితరులు టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే జగన్ హయాంలో తన పాలనలో జరిగిన అవినీతి బండారం బట్టబయలు అయ్యే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబే..కేసుల నుంచి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో తన రాజ్య సభ పక్షాన్ని విలీనం చేయించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. టీడీపీ రాజ్యసభ ఎంపీల తర్వాత అన్నం సతీష్ ప్రభాకర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్దం పుచ్చుకున్నారు. అనంతరం మరికొందరు ముఖ్యమైన టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు కూడా టీడీపీ నుంచి తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు.
తాజాగా ఈ ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణాలు చోటు చేసుకుంటాయని కమలం పార్టీ నేతలు చెబుతున్న మాటలు ఎటుదారితీస్తాయో అని టీడీపీ ఆందోళనగా ఉంది. రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని వీలినం చేసిట్లు ఏపీలో కూడ టీడీపీ శాసన సభ పక్షాన్ని బీజేపీలో వీలీనం చేసే దిశగా కూడా కొంత మంది టీడీపీ ప్రజా ప్రతినిధులు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. దీనికి తోడు ఆగస్టు 11 తరువాత రాష్ర్టంలో కీలక పరిణామాలు తప్పవని బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలు టీడీపీని కుదిపేస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఎలా తెరవెనుక పావులు కదిపి, ఎలా పార్టీని తన వెనుకకు తిప్పుకుని సీఎం అయ్యాడో…ఇప్పుడు చంద్రబాబు అమెరికా వెళ్లిన సమయంలోనే టీడీపీ నేతలు తమ పార్టీని బీజేపీలో కలిపేలా తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారని స్వయంగా తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. బాబుగారు అమెరికాలో కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే..ఇక్కడ పార్టీ కొంప మునిగేలా ఉందని పచ్చ నేతలు భయపడుతున్నారు. మొత్తంగా టీడీపీలో మరోసారి ఆగస్టు సంక్షోభం రానుందని, టీడీపీ పార్లమెంటరీ పార్టీ లాగానే శాసనసభా పక్షం కూడా బీజేపీలో మెర్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి టీడీపీలో మరోసారి ఆగస్టు సంక్షోభం వస్తుందా లేదా అని తెలియాలంటే మరో పది రోజులు ఓపిక పట్టాల్సిందే.