ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్ పనులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 60సీ నిబంధన ప్రకారం నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. అంతేకాకుండా రూ.3220 కోట్ల జల విద్యుత్ టెండర్లను కూడా ఈ సంస్థ దక్కించుకుంది.
ఇందులో నుంచి కూడా తప్పుకోవాలని సదరు సంస్థకు ఇరిగేషన్ శాఖ సూచించింది. ఇప్పటికే జగన్ పోలవరం పనులపై ఒక కమిటీ ఏర్పాటు చేయగా పోలవరం పనుల్లో అవినీతి జరుగుతుందని ఆ కమిటీ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలను కాన్సిల్ చేసి రివర్స్ టెండర్లకు వెళ్తే అక్రమాలను అడ్డుకునే అవకాశం ఎక్కువగా ఉందని వారు సూచించారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అందరు అనుకునేలోపే జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నవయుగ సంస్థను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.