ఆర్ధిక సమస్యలతో కేఫ్ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్ కింగ్, రుణ ఎగవేత విజయ్ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్ ఎంట్రపెన్యూర్ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానన్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేననన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే వ్యవహరిస్తున్నారన్నారు. అయితే కాఫీ కింగ్ గా కష్టపడి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన సిద్దార్దకి వేలకోట్ల బ్యాంక్ లోన్లు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకి పారిపోవడం చేతకాలేదు.. ఆయన జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి.? అంచెలంచెలుగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగి ముప్పై వేలమందికి ఉద్యోగాలు ఇచ్ఛే తెలివితేటలతో కూడా చిన్న చిన్న ఆర్ధిక సమస్యలతో నదిలో దూకి ఆత్మ హత్య చేసుకునే పిరికితనం వచ్చిందంటే కచ్చితంగా అది మంచితనమే..
కష్టపడి కాఫీ సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి ఆత్మ హత్య చేసుకోవాలని అనుకునే ముందు ఆయన ఎంత మానసికంగా కుమిలిపోయి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.. సిద్దార్ధ సక్సెస్ ఫుల్ పర్సనా లేక ఫెయిల్యూర్ పర్సనా అంటే కచ్చితంగా నిన్నటివరకూ బిజినెస్ పేజీలో ఉన్న ఆయన ఫొటో చావు వార్తతో పత్రికల్లో వచ్చింది. ఆయన ఒక మంచి మనిషి అని.. కానీ లాభనష్టాలు లెక్కించకుండా సీసీడీలు తెరవటంలో కాస్త తొందరపాటు ఉన్న వ్యక్తి అని అందరూ భావిస్తారు. ఉదాహరణకు.. మదీకెరీ – మంగళూరు మధ్య హైవే మీద గ్రామీణ ప్రాంతంలో రెండు ఔట్‌లెట్లు ఏర్పాటు చేశారట.. నిజానికి ఇక్కడ కాఫీ సేల్స్ ఉండవు.. అయినా తన బ్రాండ్ పల్లె పల్లెకు విస్తరించాలని అక్కడ ఏర్పాటు చేసారు. నిజానికి ఆయన ప్రస్థానం , ఎదుగుదల అందరికీ ఆదర్శమే.. ఆయన జీవిత ముగింపు మాత్రం వ్యాపార సామ్రాజ్యానికి గుణపాఠం లాంటిది.. ఆత్మహత్య చేసుకునే ముందు నేత్రావతి నది సమీపంలో ఉన్న కాఫీ డేకి వెళ్లి ఒక కప్పు కాఫీ తాగి ఉంటే ఆయన ఆలోచన మారేదేమోనని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు.