కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ దిశగా తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఎన్‌ఈపీ ముసాయిదాపై విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని అస్కిలో నిర్వహించిన చర్చకు జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీల్లో పరిశోధనలు చేయడానికైనా ప్రాథమికస్థాయి నుంచే విద్యార్థిలో శాస్త్రీయ ధృక్పథం ఉండాలని, కానీ నైపుణ్యాలు పెంచడానికే ప్రాధాన్యం ఇవ్వాలనడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యలో విద్యార్థికి చదువు రావాలంటే, ఉపాధ్యాయులకు నైపుణ్యాలు ఉండాలని.. అప్పుడు విద్యార్థులకూ అబ్బుతాయన్నారు. ఫలితంగా ఉన్నత విద్యాభ్యాసం తర్వాత విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ప్రాథమిక విద్యస్థాయిలోనే పునాది పడుతుందని చెప్పారు. అంతేకాని పిల్లలంతా రేంచ్‌లు పట్టుకోవాలనడం సమంజసం కాదని విమర్శించారు. చదువు జీతం కోసమే కాదని, జీవితం కోసమనే విషయాన్ని విస్మరించవద్దని చెప్పారు. ప్రాథమిక విద్యావిధానాన్ని బలోపేతం చేయకుండా ఉన్నతవిద్యను బలోపేతం చేస్తే ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులకు చదువుతోపాటు మానసిక ఉల్లాసం కలిగించేలా విద్యావిధానం ఉండాలని, కానీ ఎన్‌ఈపీ ముసాయిదా దీనికి భిన్నంగా ఉన్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటనే విషయంపైనా చర్చ జరుగాలని కోరారు. రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాలకు కేంద్రం ఊరికే నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్రాల నుంచి సెస్సు వసూలు చేస్తున్నదని గుర్తుచేశారు. కేంద్రంలో ఒకరు ఒక విధానాన్ని అమలుచేస్తే.. మరొకరు రద్దుచేసి, కొత్తది అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతున్నదని, మోడల్ స్కూల్ విధానం ఒక ఉదాహరణ అని వివరించారు.
దీనిపై సమగ్రంగా చర్చ జరుగాల్సి ఉందని, అందుకోసమే ఎన్‌ఈపీ డ్రాఫ్ట్‌పై అభిప్రాయాలు పంపడానికి నెలరోజులు గడువు కోరామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ విద్యావిధానం ఉండాలని కోరారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమరంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. తర్వాత వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని పేర్కొన్నారు. ఇప్పుడు విద్య, వైద్యంపై దృష్టి పెట్టారని.. త్వరలో విద్యావిధానంపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.