సమయపాలన మనకే కాదు… నెలసరికీ ఉండాలి. అది ఏ మాత్రం అదుపు తప్పినా… మనలో ఏవో సమస్యలు ఉన్నట్లే. అందుకు కారణాలు ఏంటి? పరిష్కారాలు ఏమున్నాయి? తెలుసుకుందామా…
రుతుక్రమం, నెలసరి అనే పేర్లలోనే అది క్రమబద్ధంగా వచ్చేదని అర్థం ఉంది. సాధారణంగా అయితే… 28 నుంచి 30 రోజులకోసారి నెలసరి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అటుఇటుగా వచ్చినా పట్టించుకోనక్కర్లేదు. ఎప్పుడైతే మూడు వారాలకన్నా ముందు వచ్చినా… నలభై రోజులు దాటి ఆలస్యంగా వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. ఈ పరిస్థితి ఇర్రెగ్యులర్ పిరియడ్స్ కోవలోకి వస్తుంది. దీనికి కారణాలు, చేయాల్సిన పరీక్షలు, చికిత్సల గురించి తెలుసుకునే ముందు అసలు నెలసరి సక్రమంగా ఎలా వస్తుందో చూద్దాం.
నెలసరిని హార్మోన్లు నియంత్రిస్తాయి. మెదడులోని హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. ఇది అండాశయాలపై ప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథి నుంచి తయారయ్యే హార్మోన్లూ నెలసరి రావడానికి దోహదం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలసరి సమయానికి రాకపోవచ్చు. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ లోపాలతో పాటు మరికొన్ని ఇబ్బందుల వల్లా ఈ సమస్య ఎదురవ్వొచ్చు.
* సహజ కారణలు
మామూలుగా ఆడపిల్లకు పది, పదహారు సంవత్సరాల మధ్య నెలసరి మొదలవుతుంది. మెనోపాజ్ వరకు అది కొనసాగుతుంది. రుతుక్రమం మొదలైన కొత్తల్లో, ఆగిపోయేముందు సహజంగానే నెలసరి ఆలస్యం కావొచ్చు. హార్మోన్లు తయారు కావడం మొదలైనప్పుడు… విడుదల ఆగిపోతున్నప్పుడు, కాన్పు అయ్యాక, పాలిచ్చేటప్పుడు నెలసరి క్రమం తప్పొచ్చు. గర్భనిరోధక మాత్రలు వాడి మానేసినప్పుడు, హార్మోన్ల సమస్య ఉన్నప్పుడు, కాపర్‌టీ వేయించుకున్నప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇందుకు మరికొన్ని కారణాలూ తోడవ్వచ్చు.
జీవనశైలిలో మార్పులు: బరువు విపరీతంగా తగ్గినా, పెరిగినా నెలసరి ఆలస్యం కావచ్చు. చదువుల ఆందోళన, కుటుంబ పరిస్థితులు….ఇతరత్రా అంశాలెన్నో మానసిక ఒత్తిడికి కారణం కావొచ్చు. దాని ప్రభావంతో అమ్మాయిల్లో నెలసరి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సరైన పోషకాహారం తీసుకోకపోయినా, విపరీతంగా డైటింగ్(ఎనొరొక్సియా, బులీమియా) చేసేవారిలోనూ నెలసరి సక్రమంగా రాదు.
హార్మోన్ల అసమతుల్యత: పీసీఓఎస్ ఉన్నవారికి నెలసరి ఆలస్యంగా రావడం చూస్తుంటాం. అదొక్కటే కాదు థైరాయిడ్ లోపాలు, ఎడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నా ఇలా కావొచ్చు. క్రోమోజోముల లోపాలు ఉన్న స్త్రీలకు అండాల నిల్వ ఉండదు. ఒక్కోసారి అసలు అండాశయాలే తయారుకావు. ఆ సమస్యలే కాదు, గర్భాశయం చిన్నగా ఉన్న స్త్రీలకు నెలసరి సక్రమంగా రాదు. ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నవారిలో ముందుగానే అండాశయాల పనితీరు ఆగిపోతుంది. అది ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. అంటే నలభై దాటకముందే నెలసరి ఆగిపోయి, మెనోపాజ్ వస్తుంది.
మందులు అవసరమా…
నెలసరి క్రమం తప్పకుండా రావాలంటే…చక్కని జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. బరువు పెరగకుండా, మరీ తగ్గకుండా చూసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. సమస్య పెద్దది కానప్పుడు కొన్ని నెలలపాటు హార్మోన్లను క్రమబద్ధీకరించేందుకు గర్భనిరోధక మాత్రలు వాడితే సరిపోతుంది. పీసీఓఎస్ ఉన్న స్త్రీలకు హార్మోన్లతోపాటు మెట్ఫామిన్ వంటి ఇన్సులిన్ సెన్సిటైజర్ మందుల్ని వైద్యులు సూచిస్తారు. అండాశయంలో అండాలు తక్కువగా ఉండి.. హార్మోన్ల స్థాయులు తక్కువగా ఉన్నవారికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు హెచ్‌ఆర్‌టీ రూపంలో ఇస్తారు. దీనివల్ల నెలసరి సక్రమంగా రావడంతో పాటు ఎముకలు, గుండె ఆరోగ్యం బాగుంటుంది. |
పరీక్షలు తప్పనిసరి…
నెలసరి ఆలస్యం అయిన ప్రతిసారి డాక్టర్‌ని సంప్రదించాలా అనే సందేహం ఎదురవుతుంది చాలామందికి. అన్నిసార్లు అవసరం లేదు. నెలసరి సక్రమంగా వచ్చే స్త్రీలల్లో ఒకేసారి రెండు లేదా మూడునెలలు దాటిరాకపోయినా… గర్భం దాల్చామనే సందేహం వచ్చినా వైద్యుల్ని సంప్రదించాలి. ఒళ్లంతా వేడిగా అనిపించడం, చెమటలు పట్టడం, బరువు పెరగడం వంటి లక్షణాలతో పాటు వక్షోజాల నుంచి పాలు కారుతున్నా, తలనొప్పి, దృష్టిలోపాలు… ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. గర్భ నిరోధక మాత్రలు వాడి మానేసిన తరువాత మూడు నెలలు నెలసరి రాకపోయినా తేలిగ్గా తీసుకోకూడదు. సమస్యను బట్టి వైద్యులు ఎత్తు, బరువు, బీఎంఐ పరీక్షించి చూస్తారు. పీసీఓఎస్, థైరాయిడ్ వంటి లక్షణాలను అంచనా వేస్తారు. పొట్టను పరీక్షించి, గర్భం ఉందేమో చూస్తారు. హార్మోన్ల పనితీరులో లోపాలు ఉంటే వాటికి సంబంధించిన పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం పనితీరుని తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహిస్తారు. నెలసరి సక్రమంగా రాకపోతే అండం సరిగ్గా విడుదల కావడంలేదని అర్థం. అలాంటివారు గర్భం రావడానికి ఇన్‌ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. ఈస్ట్రోజెన్ హార్మోను లోపం ఉన్నా… నెలసరి సరిగ్గా రాదు. ఇదే కొనసాగితే ఎముకలు బలహీనపడి, ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజెన్ లోపం వల్ల గుండెజబ్బుల ప్రమాదమూ ఎక్కువగానే ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న స్తీలలో అధికరక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడం, మధుమేహం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. By Enadu