ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఒక స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది.
ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ సభ్యుల మద్దతును కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు శుక్రవారం రాత్రి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవీ దేవెగౌడ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావడమా? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. అయితే ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నారని వెల్లడించారు. తనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై కుమారస్వామి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన తెలిపారు.