తాజాగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జషిత్ కిడ్నాప్ కధ సుఖాంతమయ్యంది. కిడ్నాపర్ల చెర నుంచి జషిత్ సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం కుతుకులూరు దగ్గర బాలుడ్ని కిడ్నాపర్లు వదిల వెళ్లారు. స్థానికుల సమాచారంతో జషిత్ ను మండపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. మూడ్రోజుల తర్వాత కన్నకొడుకును చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. కిడ్నాపర్ల చెరలో ఎలా ఉన్నాడో తెలియక అల్లాడిపోయిన పేరెంట్స్.. కొడుకును చూసి తల్లడిల్లారు.
మండపేటలోని విజయలక్ష్మీనగర్ లో సోమవారం రాత్రి కిడ్నాపర్లు జషిత్ ను ఎత్తుకెళ్లారు. నానమ్మ పార్వతిపై దాడి చేసి బైక్ పై తీసుకెళ్లారు. మొత్తం తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును చేధించేందుకు ఎస్పీ నయీం అస్మీ రంగంలోకి దిగారు. బాలుడి ఆచూకీ కోసం 17 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు సోషల్ మీడియాలో జషిత్ ఫోటోలతో కిడ్నాప్ కేసుపై విపరీత ప్రచారం జరగడం.. అందరూ తమ వంతుగా గాలించడంతో నిందితులు కనీసం ఫోన్ చేసి డబ్బులు కూడా డిమాండ్ చేయలేదు.. భారీఎత్తున ప్రచారం రావడంతో భయపడిన కిడ్నాపర్లు జషిత్ ను ఈ ఉదయం కుతుకులూరు దగ్గర వదిలి పారిపోయారు.ఇది కచ్చితంగా సోషల్ మీడియా విజయంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.