టీటీడీలో క్రిష్టోఫర్ నియామకం అంటూ తాము ప్రచురించిన వార్త తప్పు అని TV5 వివరణ ఇచ్చింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ అనే వ్యక్తిని నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించింది. ఇలాంటి అసత్య వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఆగ్రహించారు. ఈ క్రమంలో దరువు కూడా వరుస కధనాలు ప్రచురించింది. దీంతో దిగివచ్చిన టీవీ5 సదరు వార్తపై క్షమాపణలు చెప్తూ పొరపాటు జరిగిందంటూ మరోవార్త ప్రచురించింది.
టీవీ5 వివరణ ఇలా ఉంది. టీటీడీలో డీఈఓగా ఏపీ సీఎం జగన్ బంధువు క్రిష్టోఫర్‌ను నియమించినట్లు మా వైబ్‌సైట్‌లో తప్పుగా కథనం వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి మా వెబ్ సిబ్బంది ఈ వార్తను పోస్ట్ చేశారు. అయితే ఆ వార్త నిజం కాదని తేలింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం. మత పరమైన అంశాల విషయంలో టీవీ 5 తొలి నుంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఈ తప్పుకు బాధ్యులైన వారిని గుర్తించి వారిపై చర్య తీసుకుంటామని వెబ్ పాఠకులకు తెలియజేస్తున్నాం. అంటూ వివరణ ఇచ్చింది.