గడిచిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన వైస్సార్సీపీ పార్టీ అదే ఊపులో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది . గడిచిన ఎన్నికలలో 151 ఎమ్మెల్యేల సీట్లు సాధించిన అధికార పార్టీ అదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేయాలని పధకాలు రచిస్తోంది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన నవరత్నాలని ఇప్పటికే అమలు చేయటం మొదలుపెట్టిన సీఎం జగన్ మరో ముఖ్యమైన హామీని అమలుచేయటానికి కసరత్తు చేస్తున్నారు . ఇప్పుడున్న 13 జిల్లాలను 25 జిల్లాలకు పెంచే కార్యక్రమం ఆఘమేఘాల మీద నడుస్తుంది . దానికి సంభదించిన విధివిధానాలు ఇప్పటికే అధికార యాత్రంగానికి ముఖ్యమంత్రి వివరించినట్లు తెలుస్తోంది . స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే జిల్లాల విస్తరణ పూర్తి చేయాలని ఆ తరువాత వెంటనే స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది . అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నవంబర్ నెలలో స్థానిక సంస్థలకి మరియు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
గడిచిన ఎన్నికలలో రాయలసీమలో ఏకపక్ష విజయాలు సొంతం చేసుకొన్న అధికార పార్టీ మళ్ళీ అలాంటి విజయాలనే నమోదు చేయాలనే పట్టుదలగా ఉంది . అందులో భాగంగానే రాయలసీమలో ప్రతిష్టాత్మకైన కర్నూల్ కార్పొరేషన్ మీద అందరి దృష్టి పడింది .కర్నూల్ కార్పొరేషన్ ఏర్పడి నుండీ ఇప్పటివరకూ ముగ్గురు మాత్రమే మేయర్లుగా ఎన్నికయ్యారు .గడిచిన పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించని కారణంగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే కొనసాగుతుంది . రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్లు లిస్టులు తయారు చేయటం , అదేసమయంలో వార్డు స్థాయిలో రిజర్వేషన్లని పూర్తి చేయాలని కార్పొరేషన్ అధికారులని ఆదేశించటమైనది.
దీనితో రాజకీయపార్టీలు కూడా ఎన్నికలు కోసం సమాయత్తమవుతున్నాయి . అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన వైస్సార్సీపీ పార్టీ ఎన్నికలు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తోంది . అసెంబ్లీ ఎన్నికలలో అవకాశం రాని నేతలు మేయర్ పదవి కోసం పావులు కదుపుతున్నారు .
కర్నూల్ జిల్లాలో యస్వీ కుటుంభానికి ప్రత్యేకస్థానం ఉంది . వైస్సార్సీపీ ఆవిర్భావం నుండీ వైయస్ కుటుంభానికి అండగా నిలిచింది . పార్టీ తొలినాళ్లలో వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో విజయమ్మకు శోభా నాగిరెడ్డి అండగా ఉండటం అదే సమయంలో జిల్లాలో యస్వీ కుటుంభం పార్టీ బాధ్యతలని తలకెత్తుకొని పని కష్టపడి పని చేయటం జరిగింది .
సమైఖ్యఆంధ్ర ఉద్యమంలో విజయమానోహరి కీలకపాత్ర !
రాష్ట్ర విభజన సమయంలో ఉవ్వెత్తిన ఎగిసిన సమైక్య ఆంధ్రా ఉద్యమానికి కర్నూల్ లో విజయ మనోహరి నాయకత్వం వహించారు . అంతే కాకుండా రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిరాహార దీక్ష చేసిన సమయంలో కూడా జగన్ కి మద్దతుగా విజయమానోహరి కర్నూల్ లో స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుని సంచలనం సృష్టించారు . ఆ తరువాత ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు హాస్పిటల్ కి తరలించటం మనందరికీ తెలిసిన విషయమే .
2014 ఎన్నికల ముందు షర్మిలమ్మ చేసిన పాదయాత్రలో యస్వీ మోహనరెడ్డి భార్య విజయ మనోహరి స్వయంగా పాల్గొని ఆనాడు షర్మిళమ్మకి అండగా ఉండటం విశేషం . ఆ తరువాత జరిగిన 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ యస్వీ మోహనరెడ్డి కర్నూల్ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే . ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలలో భూమా కుటుంభం పార్టీ మారటం ,మరొకొన్ని రోజులకి మంత్రి పదవి కావాలంటే మీ బావమరిదిని కూడా టీడీపీలోకి తీసుకోని రావాల్సిందేనని చంద్రబాబు షరతులు పెట్టటంతో తప్పనిసరి పరిస్థితులలో యస్వీ మోహనరెడ్డి పార్టీ మారటం జరిగింది . నిజానికి భూమా పార్టీ మారినా కూడా మొదట యస్వీ పార్టీ మారటానికి అంగీకరించలేదు . కానీ అప్పటికే శోభమ్మ కోల్పోయిన నాగిరెడ్డి పదే పదే పిల్లలని వెంటబెట్టుకొని యస్వీ ఇంటికి రోజూ రావటం ‘శోభమ్మని గుర్తు చేస్తూ తమ కుటుంభం కష్టాలలో ఉందని మీరు పార్టీ మారకపోతే చంద్రబాబు పదవి ఇవ్వనంటున్నాడని’ ఇలాగైతే మూకుమ్ముడి ఆత్మహత్యలే గతని ఈ ఒక్కసారికి శోభమ్మ కోసమైనా మమ్మల్ని ఆదుకోవాలని ‘ తీవ్ర ఒత్తిడి తేవటంతో ఆఖరికి యస్వీ మోహనరెడ్డి కూడా పార్టీ మారాల్సి వచ్చింది .
పార్టీ మారటానికి మొదటి నుండీ విజయ మనోహరి వ్యతిరేకమే !
షర్మిలమ్మ పాదయాత్రలో షర్మిలకు తోడుగా నడిచిన యస్వీ మోహనరెడ్డి భార్య విజయమానోహరి మొదటి నుండీ వైయస్ కుటుంభం పట్ల ఎంతో అభిమానంగా వుంటూ వచ్చింది . పార్టీ మారే సందర్భంలో కూడా కుటుంభంలో విజయమానోహరి తీవ్రంగా వ్యతిరేకించిన సంగతిని ముఖ్య అనుచరులు ఇప్పటికీ ఆనాటి సంగతులని గుర్తు చేసుకొంటారు . అధికార పార్టీలో మారినా అక్కడ అయిష్టంగానే కొనసాగటం.. ఆఖరికి మొన్నటి ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా లెక్క చేయకుండా మళ్ళీ జగన్ సమక్షంలో పార్టీలోకి తిరిగిరావటంలో కూడా విజయమనోహారిదే కీలక పాత్ర .
ఉన్నత విద్యా కుటుంభ నేపథ్యం !
విజయమానోహరిది మొదటినుండీ ఉన్నతవిద్యా కుటుంభం . తండ్రి పేరుమోసిన డాక్టర్ , అన్నా వదినలు కూడా వైద్యరంగంలోనే డాక్టర్లుగా స్థిరపడినారు . విజయమానోహరి గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక రాజకీయ కుటుంభంలో పెళ్లి చేసుకోవటంతో ఇక అప్పటినుండి రాజకీయాల పట్ల అవగాహన పెంచుకొని కార్యకర్తలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకోవటం వాళ్ళ కుటుంబాలకి అండగా వుంటూ మంచి పేరు సంపాదించుకున్నది .
మొన్నటి ఎన్నికలలో తన భర్త యస్వీ మోహనరెడ్డి పోటీ చేయనప్పటికీ వైయస్ జగన్ ఆదేశాలననుసరించి విజయమానోహరి కర్నూల్ నగరంలో ప్రతీవార్డ్ పర్యటించి ఎమ్మెల్యే హాఫిజ్ మరియు ఎంపీ సంజీవ్ కుమార్ గెలుపులో ముఖ్యపాత్ర వహించింది . ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ రాజకీయాలకి కొత్త కావటం అవతల టీడీపీ తరుపున బలమైన అభ్యర్థులు బరిలో నిలవటంతో .. వైస్సార్సీపీ పార్టీ తరుపున యస్వీ కుటుంభం పూర్తి బాధ్యతలని తలకెత్తుకొని ఎమ్మెల్యే , ఎంపీలని గెలిపించుకొని తమ పట్టు నిలుపుకున్నారు.
కార్యకర్తలకి ఎల్లప్పుడూ అండగా ఉండే యస్వీ కుటుంభానికి మేయర్ పదవి కేటాయించాలని ఇప్పటికే కార్యకర్తలందరూ తమ అభీష్టాన్ని అధిష్టాన పెద్దలకి తెలిపినట్లు తెలిసింది . అందులో భాగంగానే ఇటీవల యస్వీ మోహనరెడ్డి కుటుంభ సమేతంగా సీఎం జగన్ ని కలిసి అభినందించిన సందర్భంలో మీ కుటుంభానికి తగిన న్యాయం చేస్తానని జగన్ అభయహస్తం ఇచ్చినట్లు తెలుస్తోంది . దీనితో కార్యకర్తలందరూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ గా విజయమానోహరికి అవకాశం దక్కటం ఖాయమని , గెలుపుకోసం ఇప్పటినుండే ప్రణాలికలు రచించుకొంటూ నగరంలోని కార్యకర్తలకు అందుబాటులో వుంటూ .. అదే సమయంలో ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలని అర్హులైన అందరికీ అందేటట్లు చర్యలు తీసుకొంటూ ప్రజలకి చేదోడు వాదోడుగా వుంటూ విజయమానోహరి ముందుకు దూసుకుపోతున్నారు .