ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన అంశం.. దీనిపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్ చేయూత తెచ్చామని సీఎం జగన్ వివరణ ఇవ్వడంతోపాటుగా తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను కూడా సభలో ప్రదర్శింపజేశారు. అయినా టీడీపీ సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేయడంపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే అలాంటిదేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానమిచ్చారు. సాక్షి పత్రికలో 45ఏళ్లు దాటితే పింఛను అని వచ్చింది. జగన్ ఏమన్నారో గుర్తు లేదా అని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు నిలదీశారు.
అయితే దానికి జగన్ ఏది చెప్పినా అది శాసనమే.. మడమ తిప్పని నాయకుడు.. చంద్రబాబులా రంగులుమార్చడం మా నాయకుడికి అలవాటు లేదు.. 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రూ.75వేలు ఇస్తామని చెప్పారు. వాటిని వక్రీకరించి మాట్లాడటం దురదృష్టకరమని పెద్దిరెడ్డి సమాధానమిచ్చారు. ఆ సమయంలో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి తాను ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడానో చూడాలని తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాల వీడియో ప్రదర్శింపజేశారు. ‘‘మోసం చేయడం.. అబద్ధాలాడటం.. మా ఇంటా వంటా లేదు.. ఇది మా మేనిఫెస్టో’’ అంటూ వివరించారు.
ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జ్వరంవచ్చి వారం రోజులపాటు పనులకు పోకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి. వారికి తోడుగా ఉండేందుకే 45 ఏళ్లకే పింఛను ఇవ్వాలని నేను చెబితే వెటకారం చేశారు. ఆ సూచనను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్ చేయూత అనే పథకానికి నాంది పలుకుతున్నాను. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన ప్రతి అక్కకు కుటుంబానికి రూ.75వేలు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా.. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి దశల వారీగా, ఆయా కార్పొరేషన్ల ద్వారా అందేలా చూస్తాననని.. 45 ఏళ్లకు పింఛను అంటూ చంద్రబాబు చూపించే క్లిప్పింగ్ 2017 అక్టోబరు 18 నాటిది. ఆ తర్వాత 2018 సెప్టెంబరు 3న విశాఖపట్నం జిల్లా కె.కోటపాడులో పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు చెప్పానని ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని మారుస్తున్నామో వివరించాన్నారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టిన తర్వాతే ప్రజలు మాకు ఓట్లేశారని జగన్ పూసగుచ్చినట్టు వివరించారు. మ్యానిఫెస్టోనే భగవద్గీగ, బైబిల్, ఖురాన్ మాదిరిగా గౌరవిస్తానన్నారు.