నిజామాబాదు లో రూ 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు రు. 246 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన భూగర్భ డ్రైనేజీ శుద్ధి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, నలభై సంవత్సరాలుగా జరగని ఎస్ టి పి కార్యక్రమాన్ని తాము పూర్తి చేశామని దీని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా, ఇంజనీర్లు, అధికారుల శ్రమ ఉందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ ప్రక్రియను ఓపెన్ ఏరియేషన్ సిస్టం సాంకేతికతతో అనుసంధానం చేసినందున 88 ఎకరాల కు బదులు కేవలం 18 ఎకరాల్లోనే ఈ పూర్తి పనులు నిర్వహించడం జరిగిందన్నారు. తద్వారా 70 ఎకరాల స్థలం ఆదా అయిందని, ఈ స్థలంలో టూ బిహెచ్ కే , కలెక్టరేట్, ఐటి hub, పార్కు లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరం లో 125 కోట్ల రూపాయలతో రహదారులు ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే 50 కోట్ల రూపాయల విలువైన రహదారులు పూర్తిచేశామని మరో 75 కోట్ల రూపాయల పనులు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో డ్రైనేజీ, రోడ్లు, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్ లు తదితర కార్యక్రమాలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా పోచంపాడు, అలీసాగర్ నుండి నిజామాబాద్ పట్టణానికి త్రాగు నీరు వస్తుందని ఆయన తెలిపారు. అంతకుముందు ఆయన మొక్కలు నాటి నీరు పోశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అర్బన్ శాసనసభ సభ్యులు బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ 1989 సంవత్సరంలో రచించిన ఈ భూగర్భ డ్రైనేజీ ప్లాంట్ ఇన్ని రోజులకు పూర్తి చేసుకునే అవకాశం తనకు లభించిందని తెలిపారు. మిషన్ భగీరథ, భూగర్భ డ్రైనేజీ, అమృత కార్యక్రమాలను ఒకే కాలంలో చేపట్టడం వల్ల రోడ్లు చెడిపోయి ప్రజలకు పలు ఇబ్బందులు ఏర్పడ్డాయని అయినా ప్రజలు అర్థం చేసుకోని సహకరించాలని తెలిపారు. ఈ భూగర్భ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ తర్వాత మన నిజామాబాద్ లోనే ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ పనులకు నిధులు కోరిన వెంటనే మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ఎస్టిపి వల్ల శుద్ధి చేసిన నీటిని ఎల్లయ్య చెరువులోకి మళ్ళీ స్తున్నామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు మాట్లాడుతూ ఎస్ టి పి వల్ల పర్యావరణానికి హాని కలుగకుండా ఉంటుందని మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని చెరువులోకి మళ్ళించడం వల్ల తిరిగి ఇతర అవసరాలకు ఉపయోగించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అంతేగాక దోమల సమస్య ఉండదని మురుగు నీరు వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండవని ఈ ప్రాజెక్టును కలిసికట్టుగా నిర్వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠ్టల్ రావు, శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జాన్ సాం సన్, ఎస్ ఇ ఆర్ అండ్ బి మధుసూదన్ రెడ్డి, హైదరాబాద్ ఆర్ అండ్ బి ఎస్ ఇ దేవానంద్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అయ్యప్ప ఇన్ఫ్రా కార్పొరేషన్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Post Views: 259